కేజీఎఫ్ - చాప్టర్ 2 దూకుడు మామూలుగా లేదు. భాషతో పనిలేదు. ప్రాంతంతో సంబంధం లేదు. అన్ని చోట్లా... రికార్డులు బద్దలే. తాజాగా ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అది కూడా 4 రోజుల్లోనే. 500 కోట్ల మార్క్‌ని అతి తక్కువ రోజుల్లో చేరుకున్న సినిమాగా సరికొత్త ఇండియన్ రికార్డ్ సృష్టించింది.
తొలి రోజు 167 కోట్లు సాధించి వారెవా అనిపించిన కేజీఎఫ్ 2.. రెండో రోజూ అదే జోరు చూపించింది. రెండో రోజు... 140 కోట్లు, 3వ రోజు 115 కోట్లు, 4 వరోజు 132 కోట్లు సాధించి.... తొలి 4 రోజులకూ 550 కోట్ల మార్క్ చేరుకొంది. ఈ వారాంతానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల మైలు రాయిని దాటేసే అవకాశం ఉందన్నది ట్రేడ్ వర్గాల టాక్. టోటల్ రన్ లో రూ.1300 కోట్ల వరకూ తెచ్చుకునే ఛాన్సుందని చెబుతున్నారు. ఆ లెక్కన కేజీఎఫ్ 1 కంటే, మొన్నటి ఆర్.ఆర్.ఆర్ కంటే.. ఇది అతి పెద్ద విజయం.
మరోవైపు కేజీఎఫ్ చాప్టర్ 3 వస్తుందని ప్రచారం జరుగుతోంది. సలార్ అయిపోయిన తరవాత ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయాలి. రామ్ చరణ్ కూడా రెడీగానే ఉన్నాడు. ఇవన్నీ అయ్యాక గానీ ... కేజీఎఫ్ 3 పనులు మొదలవుతాయని తెలుస్తోంది.