ప్రముఖ నటి మీనా ఇంట్లో విషాదం చోటు చేసుకొంది. ఆమె భర్త విద్యాసాగర్ (48) మంగళవారం అర్థరాత్రి మృతి చెందారు. కొంతకాలంగా ఆయన ఊపిరి తిత్తుల సమస్యతో బాధ పడుతూ చెన్నై లోని ఏఎంజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో.. తుదిశ్వాస విడిచారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. మీనా ఇంటిల్లిపాదికీ కొవిడ్ సోకింది. ఆ తరవాత.. అంతా కోలుకొన్నారు. కానీ... విద్యాసాగర్ ఆరోగ్యం మాత్రం క్షీణిస్తూ వచ్చింది. చివరికి పరిస్థితి విషమించింది. విద్యాసాగర్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మీనా దంపతులకు నైనిక అనే ఓ పాప కూడా ఉంది.
గత కొన్ని రోజులుగా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం మీనా హైదరాబాద్‌లో ఉన్నారు. భర్త ఆరోగ్యం విషమించిందని తెలుసుకొని హుటాహుటిన చెన్నై వెళ్లారు. అంతలోనే విద్యాసాగర్ కన్నుమూశారు. విద్యాసాగర్ మృతితో.. మీనా ఇంట్లో విషాదం నెలకొంది.
మీనా బంధువులు, కుటుంబ సభ్యులు, కొంతమంది టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు మీనా ఇంటికెళ్లి... ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.