రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం విరాట పర్వం. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. ఓటీటీ నుంచి ఆఫర్లు వచ్చినా.... నిర్మాతలు ఇవ్వలేదు. థియేటరికల్ రిలీజ్ కే మక్కువ చూపించారు. కానీ... ఫలితం తేడా కొట్టేసింది. ఈ సినిమాని ప్రేక్షకులు తిరస్కరించారు. చూసిన వాళ్లు `బాగుంది.. ఓకే` అన్నారు కానీ.. చూసిందే తక్కువ. ఆషామాషీ సినిమాలవైపు జనం చూడడం లేదని, ఏదో స్పెషల్ ఉంటేనే తప్ప థియేటర్లకురావడం లేదని.. విరాట పర్వంతో అర్థమైంది.
ఈ సినిమాకి ఇప్పటి వరకూ 5 కోట్ల వసూళ్లు కూడా రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కేవలం 4.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమాకి దాదాపు రూ.25 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యిందని టాక్. ఓటీటీ నుంచి... దాదాపు 40 కోట్లకు ఆఫర్ వచ్చింది. కానీ... సురేష్ బాబు ఇవ్వలేదు. ఈ సినిమాని రానా థియేటర్లలోనే విడుదల చేయాలని పట్టుబట్టాడు. ఓటీటీలో విడుదల చేసి ఉంటే.. ఈపాటికి రూ.15 కోట్ల లాభంతో ఈ సినిమా బయటపడేది. ఇప్పుడు దాదాపుగా అంతే నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. సురేష్ బాబు మాటని రానా విని ఉంటే... త నష్టం తప్పేదని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.