బాహుబలి ఇచ్చిన ధైర్యం... సినిమా బడ్జెట్లు పెరుగుతున్నాయి. ఎంత ఖర్చు పెట్టినా, తిరిగి సంపాదించుకోగలం అన్న నమ్మకం కలుగుతోంది. ఓ మాదిరి హీరోలు సైతం.. తమ మార్కెట్ స్థాయికి మించి రెండింతలు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. విశాల్ కూడా ఇప్పుడు ఇదే పని చేశాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ మార్కెట్ దక్కించుకున్నాడు విశాల్. తన సినిమా వస్తోందంటే బీ, సీ సెంటర్లలో హడావుడి మొదలైపోతుంది. అయితే విశాల్ రేంజ్ 30 కోట్లలోపే. కానీ తన కొత్త సినిమా `యాక్షన్`కి ఏకంగా 60 కోట్లు ఖర్చు పెట్టాడట.
సుందర్ సి.దర్శకత్వం వహించిన చిత్రమిది. తమన్నా కథానాయికగా నటించింది. ఈనెల 15న విడుదల అవుతోంది. ఈ సినిమాకి 60 కోట్ల బడ్జెట్ అయ్యిందని విశాల్ ప్రకటించాడు. అయితే తెరపై 150 కోట్ల సినిమాల కనిపిస్తుందట. సుందర్ అంత క్వాలిటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట. యాక్షన్ సన్నివేశాలన్నీ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయంటున్నాడు. తన పెట్టుబడి తిరిగి వస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు. మరి విశాల్ నమ్మకం ఏమేరకు నిజమవుతుందో చూడాలి.