ఆర్.ఎక్స్.100తో ఒక్కసారిగా ఊపులోకి వచ్చేసాడు కార్తికేయ. చేతినిండా సినిమాలు పడిపోయాయి. ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. ఇలాంటప్పుడే తప్పులు చేయడం సహజం. హిప్పీతో తప్పు చేసేసాడు కూడా. హిప్పీకి ముందు కార్తికేయ యాటిట్యూడ్ కూడా విచిత్రంగా ఉండేది. ఆ సినిమాపై చాలా కన్ఫిడెన్స్ గా మాట్లాడేవాడు. హిప్పీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అయితే.. రెచ్చిపోయి మరీ మాట్లాడాడు. మీకు ఆర్.ఎక్స్ 100 లాంటి హిట్టు కావాలా? అంతకంటే ఎక్కువ కావాలా? ఇస్తున్నాను తీసుకోండి అంటూ రెచ్చిపోయాడు.
ఈ సినిమా చూసి నా ఫ్యాన్సంతా థియేటర్ బయటకు వచ్చి... చొక్కాలు విప్పి గాల్లో ఎగరేయాలి.. అంటూ కాస్త ఓవర్ చేసాడు. హిప్పీ కాస్త ఫ్లాప్ అయ్యేసరికి... కార్తికేయకు వాస్తవ పరిస్థితులు బోధ పడినట్టున్నాయి. సినిమాలు ఆడడం అంత ఈజీ కాదు, వచ్చిన పేరు కాపాడుకోవడం అంతకు మించిన కష్టం అని అర్థమైనట్టుంది. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగానే ఉండాలి అని తెలిసుంటుంది. ఇప్పుడు కాస్త కంట్రోల్ అయ్యాడు. కార్తికేయ కొత్త సినిమా గుణ 369 విడుదలకు సిద్ధమైంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కార్తికేయ కంట్రోల్ లో వున్నట్టు కనిపించింది. ఎక్కడా ఫ్యాన్స్.. అనే మాట రాకుండా జాగ్రత్త పడ్డాడు. సినిమా హిట్టవుతుంది, సూపర్ హిట్టవుతుంది అని ప్రగల్భాలకు పోలేదు.
మంచి సినిమా చేసాను, గర్వపడే సినిమా చేశాను అని మాత్రమే చెప్పాడు. కాకపోతే `అద్భుతాలు చేసేటప్పుడు అర్థం కావు. అయ్యాకే తెలుస్తుంది..` అంటూ ఈ సినిమా ఓ అద్భుతమని పరోక్షంగా హింట్ ఇచ్చాడు. హిప్పీ ఫ్లాప్ అని ఈ’ వేడుక సాక్షిగా అంగీకరించాడు. తొలి సినిమా హిట్టుతో, ఆ కన్ఫ్యూజన్లో చేసిన సినిమా అని, అందుకే తనకు ఫ్లాప్ వచ్చిందని, ఈసారి మాత్రం ఆ పొరపాటు చేయలేదని, జాగ్రత్త పడ్డానని చెప్పుకొచ్చాడు కార్తికేయ. మరి హిప్పీ తప్పుల్ని సవరించుకున్నాడో, కొత్త తప్పుల్ని చేశాడో తెలియాలంటే... ఇంకొన్ని రోజులు ా ఆగాలి.