రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి కనకమామిడి ఫాంహౌస్ వరకు ఆయన పార్థివదేహానికి అంతిమయాత్ర నిర్వహించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. కృష్ణంరాజుకు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆయనన నివాసంలో ఉన్న ఆయన భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు కడసారి నివాళులర్పించారు. ఐదు దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో రారాజుగా వెలిగిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎప్పటికి చెరగని ముద్ర వేసుకున్నారు.