నటుడు కృష్ణుడు గుర్తున్నాడు కదా? హ్యాపీడేస్ లాంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు. వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు చిత్రాల్లో హీరోగానూ మెరిశాడు. ఇప్పుడు పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయాడు. శుక్రవారం రాత్రి.. ఓ పేకాట స్థావరం పై ఎస్వోటీ బృందం దాడి చేసింది. ఈ దాడిలో కృష్ణుడితో సహా తొమ్మిదిమంది పేకాట ఆడుతూ దొరికిపోయారు. ఘటనా స్థలంలో లక్షలాది రూపాయలతో పాటు, సెల్ ఫోన్లని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఓ విల్లాలో గత కొద్దిరోజులుగా పేకాట ఆడుతున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో.. దాడి చేశారు. ఈ దాడిలో కృష్ణుడు దొరికిపోవడంతో... కాస్త చర్చనీయాంశమైంది. గత కొన్నాళ్లుగా కృష్ణుడికి సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. తను ఇటీవల వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.కానీ.. ఆ పార్టీలోనూ యాక్టీవ్ గా లేరు. శుక్రవారం ఠాణాలోనే ఉన్న కృష్ణుడు ఆ తరవాత.. బెయిల్ పై విడుదలయ్యారు. ఈరోజు మళ్లీ పోలీసుల విచారణకు హాజరు కావాల్సివుంది.