లాక్ డౌన్ పుణ్యమా అని దినచర్యలన్నీ మారిపోయాయి. అలవాట్లు, పద్ధతులు మారాయి. కాకపోతే... చాలా కాలం తరవాత ఇంటిపట్టున ఉండే ఛాన్సు దొరికింది. ఇష్టమైనవి తిని, నచ్చిన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసేందుకు కాస్త సమయం దొరికింది. యువ కథానాయకుడు నిఖిల్ కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో తనకు ఇష్టమైన పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఖాళీ సమయాన్ని సద్వినియోగ పరచుకుంటున్నాడు. ఈ లాక్ డౌన్ వేళ మాయాబజార్, గుండమ్మ కథ లాంటి ఓల్డ్ క్లాసిక్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడట నిఖిల్. అంతేకాదు... తమిళ భాష కూడా నేర్చుకుంటున్నాడట.
ప్రస్తుతం కార్తికేయ 2 లో నటిస్తున్నాడు నిఖిల్. ఈ సినిమా కోసం బాడీని ఫిట్ గా ఉంచుకోవాల్సివచ్చింది. అందుకే సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. అయితే... కరోనా వల్ల నిఖిల్ పెళ్లి వాయిదా పడింది. కాకపోతే... ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకోవడం రిస్కేనని, ఆ పేరుతో జనాన్ని ఓ చోటకు చేర్చడం నిబంధనలకు విరుద్ధం అని, ఇలాంటి క్లిష్టమైన తరుణంలో తమ వల్ల ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, అది జీవితాంతం తమని బాధ పెడుతుందని, అందుకే పెళ్లి వాయిదా వేసుకోవాల్సివచ్చిందని, పరిస్థితులు చక్కబడ్డాక పెళ్లి గ్రాండ్ గా చేసుకుంటానని చెబుతున్నాడు నిఖిల్ సిద్దార్థ్.