లాక్ డౌన్ వల్ల జన జీవనం అస్తవ్యస్థమైంది. సినిమాలు ఆగిపోయాయి. ఆఖరికి పెళ్లిళ్లూ జరగడం లేదు. ఈపాటికి యువ కథానాయకుడు నిఖిల్ పెళ్లి జరిగిపోవాల్సింది. కానీ.. లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. లాక్ డౌన్ ఎత్తేశాక, బంధు మిత్రుల సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు నిఖిల్. కానీ.. ఈనెల 18 తరవాత కూడా లాక్డౌన్ని కొనసాగిస్తుండడంతో... తప్పని సరి పరిస్థితుల్లో ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. రేపు... అంటే గురువారం హైదరాబాద్ శివార్లలో నిఖిల్ పెళ్లి నిరాడబరంగా జరగబోతోంది. డాక్టర్ పల్లవి వర్మని నిఖిల్ ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ఈ పెళ్లి వాయిదా పడింది.
అయితే.. గురువారం మంచి ముహూర్తం ఉండడంతో.. ఈ పెళ్లిని సింపుల్గా జరిపించేయాలని ఇరు కుటుంబాలూ నిర్ణయించుకున్నాయి. లాక్ డౌన్ ఎత్తేశాక, రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేయాలని నిఖిల్ భావిస్తున్నాడట. నితిన్ కూడా లాక్ డౌన్ వల్ల తన పెళ్లి వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు నిఖిల్ బాటలోనే తన పెళ్లి సింపుల్ గా చేసేసుకుంటాడేమో చూడాలి.