ప్రముఖ నటుడు రాజశేఖర్ కారు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డు దగ్గర కారు బోల్తా కొట్టింది. సమయానికి ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో రాజశేఖర్‌కి ప్రమాదం తప్పింది. కారు మాత్రం బాగా డామేజీ అయ్యింది. ముందు భాగం మాత్రం నుజ్జు నుజ్జు అయ్యింది. ఆ సమయంలో కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నారు.
చుట్టుపక్కల వాళ్లు సమయానికి వచ్చి, అద్దాలు పగలకొట్టి, కారులో ఉన్న రాజశేఖర్‌ని బయటకు తీశారు. వాళ్లే పోలీసులకు, కుటుంబ సభ్యులకూ సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో తనకేం కాలేదని, ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నానని రాజశేఖర్ కూడా ఓప్రకటనలో తెలిపారు.