మినిమమ్ గ్యారంటీ హీరోగా అల్లరి నరేష్‌కి మంచి పేరుండేది. అల్లరోడితో సినిమా చేస్తే మినిమమ్ గ్యారంటీ హిట్ పక్కా అని దర్శక, నిర్మాతలకు ధైర్యం ఉండేది. అదంతా ఒకప్పుడు. ఇప్పుడా ధైర్యం లేదు. అందుకు కారణం అల్లరోడిని వరుసగా వెంటాడుతున్న ఫెయిల్యూర్సే. ఇటీవల 'సిల్లీ ఫెలోస్' అంటూ సునీల్‌తో కలిసి వచ్చాడు. ఓకే అనిపించాడు కానీ, నరేష్ రేంజ్‌కి అది సరిపోదు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి 'మహర్షి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా రిజల్ట్ ఎలాంటిదో తెలిసిందే. కానీ, అందులో నరేష్ పాత్రకి చాలా మంచి మార్కులు దక్కాయి. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు కూడా. ఆ తర్వాత అలాంటి పాత్రల్లో నరేష్‌ని చూసేందుకు ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారనే రెస్పాన్స్ కూడా వచ్చింది.
అయితే, అలాంటి పాత్రలు అన్ని సార్లూ దక్కవు కదా. ఇకపోతే, ప్రస్తుతం సోలో హీరోగా నరేష్ 'బంగారు బుల్లోడు' సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పి.వి.గిరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. దీంతో పాటు ఓ కాన్సెప్ట్ బేస్‌డ్ మూవీలో అల్లరోడు నటిస్తున్నాడు. హరీష్ శంకర్ వద్ద కో డైరెక్టర్‌గా పని చేసిన విజయ్ కనక మేడల ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. కాన్సెప్ట్ బేస్‌డ్ మూవీస్‌కి ఈ మధ్య ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కుతోంది. మరి నరేష్ ఎంచుకున్న కాన్సెప్ట్ ఎలాంటిదో కానీ, ఈ సినిమా గురించి నరేష్ కొంచెం ఎక్కువే చెప్పుకొస్తున్నాడు. చూడాలి మరి ఆ ఎక్కువ, తక్కువలేంటో.!