రాళ్లపల్లి... సహజమైన నటనకు ప్రతిరూపం ఆయన. శుక్రవారం ఆయన కన్ను మూశారు. రాళ్లపల్లి మరణం చిత్రసీమకు తీరని లోటు. ఆయన విలక్షణమైన నటుడిగా, నాటక రంగ కళాకారుడిగా అందరికీ తెలుసు. అతి కొద్దిమందికే తెలిసిన విషయం ఏమిటంటే... ఆయన చేయి తిరిగిన వంటగాడు కూడా! వంశీ మంచి భోజన ప్రియుడు. ఆయన సినిమాల్లో రాళ్లపల్లికి మంచి పాత్రలు దక్కేవి.
సెట్లో రాళ్లపల్లి ఉన్నారంటే... ఆ రోజు కూర వండే బాధ్యత ఆయనకు ఇచ్చేసేవారట వంశీ. `ఈరోజు నీకు షూటింగ్ లేదు... వంట చేసి పెట్టు` అంటూ కాయగూరలన్నీ ఆయన ముందు గుమ్మరించేవారట. జాతీయ ఉత్తమ నటుడు కమల్‌హాసన్... రాళ్లపల్లి వంటలకు గొప్ప అభిమాని అయిపోయారు. `సినిమాలు మానేసి మరో ఉద్యోగం చూసుకోవాలంటే నా దగ్గరకు వచ్చేయండి. హాయిగా వండి పెడుదురుగాని` అనేవార్ట.
రాళ్లపల్లి చేసే గుత్తి వంకాయ కూర అంటే... కె.విశ్వనాథ్ పడిచచ్చిపోయేవార్ట. తన సన్నిహితులకు తన చేతులతో స్వయంగా వండి , వడ్డించడంలో ఎక్కువ తృప్తి పడేవారట రాళ్లపల్లి. పాపం... అలాంటి గొప్ప వ్యక్తి... ఈరోజు మన మధ్య లేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.