ఏంటో.. టాలీవుడ్‌కి దిష్టి తిగిలినట్టుంది. గాయాల సీజన్ నడుస్తున్నట్టుంది. వరుసగా యువ హీరోలంతా గాయాల బారిన పడుతున్నారు. మొన్న నాగశౌర్య, నిన్న సందీప్ కిషన్... ఇప్పుడు శర్వానంద్. `96` షూటింగ్ సందర్భంగా శర్వానంద్ కూడా గాయపడ్డాడు. శర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నిపుణులైన ట్రైనర్స్ ఆధ్వర్యంలో శర్వా రెండు రోజులు ప్రాక్టీస్ చేశారు. మూడో రోజు ప్రాక్టీస్ చేస్తుండగా శర్వా గాయపడ్డాడు. నాలుగు సార్లు సేఫ్‌గా ల్యాండ్ అయిన శర్వా... ఐదోసారి ల్యాండ్ అయ్యేటనప్పుడు ఇబ్బంది పడ్డాడు. గాలి ఎక్కువగా రావడంతో కాళ్లపై ల్యాండ్ కావాల్సింది పోయి.. భుజాలను మోపి ల్యాండ్ అయ్యారు.
ఆ కారణంగా భుజానికి గాయమూంది. కాలు కూడా స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. ఈ ఘటన తర్వాత శర్వానంద్ వెంటనే థాయ్‌లాండ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా వెళ్లి హైదరాబాద్‌లోని సన్ షైన్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. శర్వాను పరీక్షించిన డాక్టర్లు భుజానికి బలమైన గాయం తగలిందని, కాబట్టి శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. సోమవారం ఈ శస్రచికిత్స జరగనుంది. సర్జరీ తర్వాత కనీసం నాలుగు రోజులు హాస్పిటల్‌లోనే ఉండాలని డాక్టర్స్ శర్వాకు సూచించారు.