రావడం రావడంతోనే ఓ కెరటంలా విరుచుకు పడ్డాడు ఉదయ్ కిరణ్. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే.. ఒకదాన్ని మించి మరో విజయం. టాలీవుడ్ దృష్టిని ఆకర్షించి, అనతికాలంలోనే స్టార్‌గా ఎదిగాడు. ఎంత త్వరగా ఎదిగాడో, అంతే వేగంగా కిందకు పడ్డాడు. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జీవితం ఎలా అర్థాంతరంగా ఆగిపోయిందో, అప్పుడూ ఉదయ్ కిరణ్ జీవితం అలానే పుల్ స్టాప్ పడిపోయింది. ఆరోజుల్లోనే ఉదయ్ కిరణ్ బయోపిక్ తెరపైకి వచ్చింది. తేజ దర్శకత్వం వహిస్తారని చెప్పుకున్నారు.
అయితే అది కేవలం మాటలకే పరిమితం అయ్యింది. ఈరోజు ఉదయ్ కిరణ్ పుట్టిన రోజు. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉదయ్ కిరణ్ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో.. ఉదయ్ కిరణ్ జీవితాన్ని బేరీజు వేసుకుంటున్న ఈ తరుణంలో.. ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తే బాగుంటుందన్న ఆలోచన చాలామందికి వచ్చింది. ఓ దర్శకుడు అందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. నిజంగా ఈసారైనా ఉదయ్ కిరణ్ బయోపిక్ కార్యరూపం దాలిస్తే అంతకంటే కావల్సింది ఏముంది? ఉదయ్ కిరణ్ జీవితంలో ఎత్తు పల్లాల గురించి, తాను అనుభవించిన మానసిక క్షోభ గురించి ఈతరం హీరోలకు తెలియాలి. చాలామందికి ఆ జీవితం గుణపాఠం కావాలి. వి మిస్ యూ.. ఉదయ్...