స్వయం వరం, చిరునవ్వుతో సినిమాలతో ఆకట్టుకున్నాడు వేణు. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. కొంతకాలంగా వేణు సినిమాల్లో కనిపించడం లేదు. బోయపాటి `దమ్ము` తరవాత దాదాపుగా తెర మరుగైపోయాడు. ఇప్పుడు మళ్లీ స్క్రీన్‌పైకి వచ్చాడు. కాకపోతే ఇది వెండి తెర కాదు.. పొలిటికల్ తెర. తెలంగాణ ఎన్నికల హోరు, జోరు రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో వేణు కూడా ప్రచారం కోసం బరిలో దిగాడు. మహాకూటమి తరపున గట్టిగానే ప్రచారం చేస్తున్నాడు.
మహాకూటమికీ, వేణుకీ లింకెక్కడ ఉంది? అనుకుంటున్నారా? ఖమ్మం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు.. వేణుకి స్వయానా బావ. ``అమ్మానాన్న తరవాత నాకన్నీ మా బావగారే. ఖమ్మంలో ఆయన్ని గెలిపించుకుంటా. అందుకే ప్రచారం చేస్తున్నా`` అంటున్నాడు వేణు. ఖమ్మం నియోజక వర్గంలో ప్రజలు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని,
సరైన పింఛన్లు అందడం లేదని, రైల్వే ట్రాకుల పక్కన బతుకుతున్నారని, డ్రైనేజీ సమస్యలు కూడా చాలా ఉన్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఖమ్మం ప్రజలు బాధలు పడుతున్నారని, వాళ్ల సమస్యల్ని రాబోయే మహాకూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చాడు వేణు. తన జోరు చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో దిగినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. చూద్దాం... వేణు ఎటువైపుగా అడగులు వేస్తాడో?