ఈ సెలబ్రెటీలు ఉంటారే... కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ల ఆలోచనలు వాళ్లపై అభిప్రాయాల్ని ఒక్కసారిగా మార్చేసేలా చేస్తుంటాయి. అప్పుడెప్పుడో సచిన్ టెండూల్కర్ విదేశాల నుంచి ఫెరారీ కారుని దిగుమతి చేసుకుని.. `నాకు టాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వండి` అంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. కోటానుకోట్లకు అధిపతి.. టాక్స్ చెల్లించను అంటే, దేశం మొత్తం అవాక్కయ్యింది. సచిన్ మరీ ఇంత పిసినారేంటి? అనుకుంది.
ఇప్పుడు విజయ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఇటీవల విజయ్ ఇంగ్లండ్ నుంచి రోల్స్‌రాయల్ కారుని దిగుమతి చేసుకున్నాడు. తను కూడా.. పన్ను నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోర్టుకెక్కాడు. కోర్టు ఈ విషయంలో విజయ్‌పై సీరియస్ అయ్యింది. `హీరోలు బయట కూడా హీరోల్లానే ప్రవర్తించాలి.. ప్రజల దృష్టిలో చులకన కావొద్దు` అంటూ చురక అంటించింది. కోర్టు సమయం వృథా చేసినందుకు లక్ష రూపాయల జరిమానాని కరోనా ఫండ్ గా చెల్లించాలని ఆదేశించింది. దాంతో సోషల్ మీడియాలోనూ విజయ్ బాగా ట్రోల్ అయ్యాడు. అయితే.. కోర్టు చెప్పినా విజయ్ ఇప్పటి వరకూ ఆ జరిమానా చెల్లించలేదు. దీనిపై విచారణ జరిగింది.
``ఈయేడాది కరోనా సమయంలో తమిళనాడు ప్రభుత్వానికి విజయ్ పాతిక లక్షలు విరాళం ఇచ్చాడు. కాబట్టి.. ఆ లక్ష చెల్లించడం లేదు..`` అని విజయ్ తరపున న్యాయవాది కోర్టుకి స్పష్టం చేశారు. దాంతో కోర్టు కూడా `ఓకే` అంది. అంటే.. అప్పుడు పాతిక లక్షలు ఇచ్చాడు కాబట్టి, ఇప్పుడు లక్ష రూపాయలు ఇవ్వడం ఎందుకని.. విజయ్ జరిమానా చెల్లించలేదట. అప్పట్లో పాతిక లక్షలు ఇచ్చిన విజయ్.. ఇప్పుడు ఇంకో లక్ష రూపాయిలు ఇవ్వడానికి ఆలోచించడమేమిటన్నది నెటిజన్ల ప్రశ్న. అలా.. మరోసారి ట్రోలింగ్ కి అడ్డంగా దొరికిపోయాడు విజయ్. లక్షలు, కోట్లు ఖర్చు పెడుతూ... ఇలా చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించడం ఏమిటని విజయ్‌ని అంతా నిలదీస్తున్నారు. ఏమిటో.. విజయ్. ఎంతకీ అర్థం కాడు.