సినీ, రంగస్థల నటుడు వైజాగ్ ప్రసాద్ ఇకలేరు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. రంగస్థలం నుంచి వెండితెరకు పరిచయమైన ఆయన.. బుల్లితెరపై కూడా తానేంటో నిరూపించుకున్నాడు.
1983లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన బాబాయ్ - అబ్బాయ్ సినిమాతో వైజాగ్ ప్రసాద్ సినిమాల్లోకి రంగప్రవేశం చేసారు. ఆ తర్వాత తేజ దర్శకత్వం వహించిన 'నువ్వు-నేను' సినిమాలో హీరో ఉదయ్ కిరణ్ తండ్రి పాత్రలో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఆయనకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. జై చిరంజీవ, భద్ర, నీరాజనం, జెమిని, అల్లరి బుల్లోడు, సుందరకాండ తదితర చిత్రాల్లో ఆయన నటించారు.
వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. విశాఖపట్నం లోని గోపాలపట్నం ఆయన స్వస్థలం. వైజాగ్ నుండి వచ్చాడు కాబట్టి ఆయన పేరు వైజాగ్ ప్రసాద్ గా స్థిరపడిపోయింది. ఆయన భార్య పేరు విద్యావతి. వీరికి రత్నప్రభ, రత్న కుమార్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
వైజాగ్ ప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ఆయన మృతి సినీ పరిశ్రమకి తీరని లోటని వారు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని www.iQlikmovies.com తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.