కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్ధ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘ఇండియన్-2’ సినిమా వివాదాస్పదంగా వార్తల్లోకెక్కింది. ఈ సినిమా షూటింగ్‌లో ముగ్గురు యూనిట్ సిబ్బంది ప్రమాద వశాత్తూ ప్రాణాలు కోల్పోవడమే అందుకు కారణం. షూటింగ్ సందర్భంగా ఈ తరహా ప్రమాదాలు కొత్తేమీ కాదు. అయితే, ఈ ప్రమాదం చాలా తీవ్రమైనది. భారీ క్రేన్‌ని వినియోగించే క్రమంలో జరిగిన చిన్న పొరపాటు.. ముగ్గురి ప్రాణాల్ని బలిగొంది. పైగా, దీని చుట్టూ ఇప్పుడు రాజకీయాలు ముసురుకుంటున్నాయి. వ్యవహారం సీబీఐ వరకు వెళుతోంది. దాంతో, మిగతా సినిమాల షూటింగులు అయోమయంలో పడ్డాయి.
జరిగిన ప్రమాదంపై చలించిపోయిన కమల్‌హాసన్, బాధిత కుటుంబాలకు కోటి రూపాయల విరాళంగా ప్రకటించడాన్నీ రాజకీయ కోణంలోనే చూస్తున్నారు చాలామంది. తాజా పరిణామాలతో హీరో విజయ్ ఒకింత ఇరకాటంలో పడినట్లు కన్పిస్తోంది. ఎందుకంటే, విజయ్ మీద భారతీయ జనతా పార్టీ ఓ కన్నేసింది. ఈ మధ్యనే విజయ్‌పై ఐటీ దాడులు జరిగాయి. విజయ్ కొత్త సినిమా షూటింగ్‌కి బీజేపీ శ్రేణులు అడ్డు తగులుతున్నాయి. సినిమాలపై రాజకీయ ప్రభావం వుంటుందా.? వుండదా.? అన్నదానిపై కోలీవుడ్‌లో తీవ్రమైన చర్చ జరగడానికి కారణం వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలే. ఈ నేపథ్యంలో ఆయా సినిమాల షూటింగులు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా భద్రతా చర్యలు చేపడుతున్నారట ఆయా చిత్రాల దర్శకులు నిర్మాతలు.