లాక్ డౌన్ 4.0 ఎలా ఉండబోతోందో అన్న ఊహాగానాలు చిత్రసీమని కుదిపేస్తున్నాయి. అన్ని పరిశ్రమలకూ మినహాయింపులు ఇచ్చినట్టే.. సినిమాకీ సడలింపులు ఇవ్వగలరా? ఇస్తే ఎలా ఉండబోతున్నాయి? షూటింగులు మొదలెట్టుకునే స్కోప్ ఉందా? ఇలా రకరకాల ప్రశ్నలు. పరిస్థితి చూస్తుంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలున్నాయి. పరిమితమైన సిబ్బందితో షూటింగులు చేసుకోమన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
షూటింగులకు అనుమతులు ఇచ్చినా కథానాయకులు సెట్‌కి వచ్చే ధైర్యం చేయగలరా? అనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే సినిమా షూటింగ్ చిన్న విషయం కాదు. సెట్లో కనీసం 150 నుంచి 200 మంది ఉంటారు. 24 విభాగాలూ కలిసి పనిచేయాలి. లైట్ మెన్స్, బోయ్స్, హీరోల, హీరోయిన్ల, వ్యక్తిగత సిబ్బంది.. ఇలా ఎలా లెక్కేసినా 200 మంది సెట్లో లేకపోతే షూటింగ్ జరగదు. అందులో సగానికి సగం తగ్గించేసినా 100 మంది ఉంటారు. ఇంకా గిరి గీసుకుని కూర్చోగలిగితే 50 నుంచి 70 మందైనా ఉండాల్సిందే. వీళ్ల మధ్య షూటింగ్ చేయాలన్నా భయమే. ఎందుకంటే.. కరోనా వైరస్ అంత ప్రమాదకరమైనది. హీరోలు తమ వ్యక్తిగత సిబ్బందిని తగ్గించుకోగలిగితే కాస్తలో కాస్త నయం. కానీ స్టార్ హీరోలు అందుకు ఒప్పుకోరు. ఓ పెద్ద హీరో షూటింగ్‌కి రావాలంటే కనీసం 10 మంది వ్యక్తిగత సిబ్బంది ఉండాల్సిందే. దానికి తోడు కార్ వాన్. ఏసీ లేకపోతే పనులేం జరగవు. కానీ 'ఏసీలు వాడకూడదు' అని ప్రభుత్వాలు సైతం గట్టిగా చెబుతున్నాయి. ఇన్ని భయాలు, పరిమితుల మధ్య షూటింగులు జరగడం దాదాపు అసాధ్యం. అందులోనూ పెద్ద హీరోలతో. ఇటీవల ఓ నిర్మాత మాట్లాడుతూ ''ఇప్పటికిప్పుడు షూటింగులకు అనుమతులు ఇచ్చినా, మేం చేయలేం. మా హీరోలు బయటకు రారు'' అని బాహాటంగానే చెప్పేశాడు. దాన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవొచ్చు.
''లాక్ డౌన్ ఎత్తేసినా నేను షూటింగ్ కి రాను. కరోనా భయం పూర్తిగా వదిలితే గానీ షూటింగులు పెట్టుకోవద్దు'' అని ఓ బడా హీరో తన దర్శక నిర్మాతలకు ఖరాఖండీగా చెప్పాడట. హీరోల భయాలు అలా ఉన్నాయి. అదేం తప్పు కాదు. ఎంత డబ్బు సంపాదించినా ఎవరి ప్రాణాలు వాళ్లకు ముఖ్యం, మరి... కరోనా భయాలు పూర్తిగా పోయేదెప్పుడు? వాక్సిన్‌వచ్చేదెప్పుడు? హీరోలు ధైర్యంగా బయటకు వచ్చేదెప్పుడు? ఇవన్నీ ప్రస్తుతానికి శేష ప్రశ్నలే. హీరోలే అని ఏముంది? కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం ''ఇన్ని భయాల మధ్య మేం షూటింగులు చేయలేం'' అంటున్నార్ట. అలాంటప్పుడు హీరోలు భయపడడంలో తప్పేముంది?