ప్రతి విజేత జీవితం వెనుక ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్లు. ఇవేం లేకపోతే... ఎవరి జీవితమూ పరిపూర్ణం కాదు కూడా. తగిలిన ప్రతీ దెబ్బా.. గెలుపుకి రహదారిగా మార్చుకోవడం తెలిసిన వాడే.. విజేతగా నిలుస్తాడు. ప్రముఖ హాస్య నటుడు అలీ జీవితంలోనూ చాలా ఆటుపోట్లున్నాయి. అవన్నీ దాటుకుని వచ్చాడు కాబట్టే, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు. అలీ జీవితాన్ని మార్చేసి, తనలో కసిని పెంచిన ఓ ఘటన గురించి అలీ... ఇటీవలే మీడియాతో పంచుకున్నాడు.
అలీ పద్నాలుగేళ్ల వయసు నాటి సంగతి ఇది. ఓ సినిమాలో నటిస్తున్నాడు అలీ. భోజనాల సమయం అయ్యింది. అప్పట్లో సినిమా సెట్లో భోజనాల వడ్డన నాలుగు వర్గాలుగా జరిగేదట. హీరోలు, దర్శకులు, నిర్మాత.. ఫస్ట్ క్లాస్. అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇతర కీలకమైన బృందం.. సెకండ్ క్లాస్. మిగిలినవాళ్లంతా మూడు, నాలుగో క్లాస్ లో భోజనం చేయాలి. అయితే ఈ విభజన తెలియని అలీ.. నేరుగా ఫస్ట్ క్లాస్ భోజనం దగ్గరకు వెళ్లిపోయాడట. `నీ భోజనం ఇక్కడ కాదు... పక్కకు వెళ్లు` అని ఆ చిత్ర నిర్మాత... అలీని అక్కడి నుంచి పంపేశాడట. రెండో క్లాసుకి వెళ్తే.. అక్కడా.. ఇలాంటి అవమానమే జరిగింది.
మూడో క్లాస్ దగ్గర ఆగితే... వాళ్లూ పంపేశారు. అప్పుడే అనుకున్నాడట. తాను నాలుగో స్థాయి నుంచి తొలి స్థానానికి వెళ్లాలని. హీరోలతో, దర్శకులతో కలసి భోజనం చేయాలని. అది తాను అవమానంగా భావించలేదని, ఆ ఘటన తనలో కసిని పెంచిందని, త్వరగా ఎదగాలన్న తపన రగిలించిందని చెప్పుకొచ్చాడు అలీ.