మరో హీరోయిన్ పెళ్ళి పీటలెక్కుతోంది. 'అలియాస్ జానకి' అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆ భామ పేరు అనీషా ఆంబ్రోస్. పవన్‌కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన 'గోపాల గోపాల' సినిమాలో ఈ బ్యూటీ ఓ చిన్న పాత్రలో కన్పించింది. ఆ తర్వాత ఆమెకు హీరోయిన్‌గా పవన్‌కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ దక్కిందంటూ ప్రచారం జరిగింది. కానీ, అదంతా ఉత్తదేనని తేలిపోయింది. తృటిలో ఆ ఛాన్స్ అనీషా మిస్సయ్యింది.
ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన అనీషా, హీరోయిన్‌గా మాత్రం సరైన గుర్తింపు పొందలేకపోయిన మాట వాస్తవం. ఈ భామ తాజాగా '7' అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పుడీ భామ పెళ్ళికి సిద్ధమవడంతో మళ్ళీ మీడియాలో ఈమె పేరు హైలైట్ అవుతోంది. అనీషా పెళ్ళాడబోయే వ్యక్తి సినీ పరిశ్రమకు చెందినవాడు కాదట. అనీషాకి కాబోయే భర్త పేరు జక్క గుణ అని తెలుస్తోంది. ఇటీవలే ఓ హీరోయిన్ పెళ్ళి చేసుకుంది. ఆమె ఇంకెవరో కాదు, ఎస్తేర్ నూరున్హా.
తెలుగులో తేజ దర్శకత్వంలో సాయిరాం శంకర్ హీరోగా వచ్చిన '1000 అబద్ధాలు' సినిమాలో నటించిన భామ. సునీల్ సరసన 'భీమవరం బుల్లోడు' సినిమాలో కూడా నటించింది. ర్యాపర్, సింగర్, నటుడు నోయల్‌ని ఎస్తేర్ ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అనీషా ఆంబ్రోస్ కూడా తొలుత ప్రేమలో పడి, ఆ తర్వాత జక్కా గుణని పెళ్ళాడబోతోందని సమాచారం. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో.. ఈ ప్రేమ కథ సజావుగా పెళ్ళి పీటలెక్కుతోంది.