బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన అర్చన అలియాస్ వేద వివాహం ఈ నెల 14న ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా సంగీత్ వేడుకను ఘనంగా నిర్వహించారు. హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలో కొల్ల మాధవరెడ్డి గార్డెన్ ఇందుకు వేదికైంది. సంగీత్ సందర్భంగా అర్చన తన లైఫ్ పార్ట్‌నర్‌తో కలిసి ఆనందంగా చిందులేశారు. అర్చన దంపతుల డాన్సులు చూసి, పెళ్లికి విచ్చేసిన అతిథులు కొత్త ఉత్సాహానికి లోనయ్యారు. ఈ వేడుకలో అర్చన స్నేహితుడు బిగ్‌బాస్ సీజన్ 1 విన్నర్ అయిన శివబాలాజీ తన భార్య మధుమితతో కలిసి హాజరయ్యారు.
అర్చన దంపతులతో కలిసి సంగీత్‌లో ఉత్సాహంగా డాన్సులేశారు. 14 వ తేదీ తెల్లవారుజామున అదే ప్రాంగణంలో అర్చన వివాహం ఘనంగా జరగనుంది. బిజినెస్ మేన్ జగదీష్‌తో ఇటీవల అర్చన నిశ్చితార్ధం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 1 కి 'బిగ్ నస' కంటెస్టెంట్‌గా అప్పటి హోస్ట్ ఎన్టీఆర్, అర్చనకు నిక్ నేమ్ పెట్టిన సంగతి తెలిసిందే. అంతకు ముందు హీరోయిన్‌గా పలు చిత్రాల్లో కనిపించిన అర్చన, ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించింది లేదు. కానీ, లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవలే ఓ సినిమాలో పొలిటీషియన్ పాత్రలో తళుక్కున మెరిసింది. సోషల్ మీడియాలో పలు వెబ్ సిరీస్‌తో అర్చనకు మంచి గుర్తింపు ఉంది. పెళ్లి తర్వాత కూడా ఇలాగే అర్చన తన కెరీర్‌ని కొనసాగిస్తుందేమో చూడాలి మరి.