రీల్‌లో పలు సందర్భాలు ప్రేక్షకుల్ని కంట తడి పెట్టిస్తాయి. సీన్‌లోని డెప్త్, పండించిన ఆర్టిస్ట్ టాలెంట్‌ని బట్టి ఉంటుంది ఆ సన్నివేశం. అది రీల్ సంగతి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది రియల్ సంగతి. బాలీవుడ్ భామ సుస్మితా సేన్ పెళ్లి కాకుండానే తల్లి అయిన సంగతి తెలిసిందే. అంటే, డబుల్ మీనింగ్స్ తీయొద్దు. ఆమె 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఇద్దరు ఆడపిల్లల్ని దత్తత తీసుకుని, మానవత్వాన్ని చాటుకున్నారు. సొంత తల్లిలా వారి పెంపకం, రక్షణ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా, తన తల్లి ప్రేమను చాటుకుంటూనే ఉంది సుస్మితా సేన్.
తాజాగా తన పదేళ్ల దత్త పుత్రిక స్కూల్ వర్క్స్‌లో భాగంగా తల్లి గురించి ఓ అద్భుతమైన వ్యాసం రాసింది. తన వయసుకు మించి, తన మనసులోని భావాలను వ్యాసంలో పొందుపరచడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని సుస్మితా తెలిపారు. కూతురు ఆ వ్యాసం చదువుతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సుస్మితా సేన్. ఆ వ్యాసంలోని పదాల అర్ధాలు తనకు కంట తడి పెట్టించాయని సుస్మితా పేర్కొంది. 'దత్తత తీసుకోవడం అంటే, హృదయం నుండి జన్మనివ్వడం..'అని ఈ సందర్భంగా సుస్మితా సేన్ పెట్టిన పోస్ట్ నిజంగానే మనసును కదిలిస్తోంది. బాలీవుడ్‌తో పాటు, 'రక్షకుడు' తదితర తెలుగు చిత్రాల్లోనూ సుస్మితా సేన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.