సినీ తారలు రాజకీయాలతో మమేకం అవ్వడం కొత్త విషయం ఏమీ కాదు. సినిమాల నుంచి విరామం తీసుకొని, పూర్తి స్థాయి రాజకీయ నాయకుల అవతారం ఎత్తినవాళ్లు ఎంతోమంది. ఇటు సినిమాలు, అటు రాజకీయాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నవాళ్లూ చాలామందే ఉన్నారు. సీనియర్ నటి జయసుధ కూడా కొన్నాళ్ల పాటు రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. 2009లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎం.ఎల్.ఏగా పోటీ చేసి గెలుపొందారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఆమెను పొలిటికల్ పార్టీలు ఆకర్షిస్తున్నాయి.
త్వరలోనే కాంగ్రెస్ నుంచి.. బీజేపీ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈనెల 21న అమీత్ షా సమక్షలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది. స్థానిక బీజేపీ నాయకులతో జయసుధ టచ్‌లో ఉన్నారని, భాజాపాలో చేరడానికి జయసుధ కొన్ని కండీషన్లు పెడుతున్నారని, వాటికి పార్టీ అధిష్టానం ఒప్పుకొంటేనే, జయసుధ... బీజేపీలోకి వెళ్తారని చెబుతున్నారు. ఈసారి జయసుధ ఎంపీ సీటు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జయసుధ మాత్రం ``బీజేపీలో చేరుతున్నానన్న మాట కేవలం ఊహాగానమే. ఇందులో ఎలాంటి నిజం లేదు.. రాజకీయాలపై నాకు పెద్దగా ఆసక్తి లేదు..`` అని చెబుతున్నారు.
అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వస్తే జయసుధ బీజేపీ పార్టీలోకి జంప్ చేయడం ఖాయమని, అప్పటి వరకూ ఆమె మౌనంగానే ఉంటారని, అదో పొలిటికల్ స్ట్రాటజీ అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.