మహిళా ప్రేక్షకులలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే తెలుగు స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున ఒకరు. ఇప్పటికి అమ్మాయిలలో ఆయన ఫాలోయింగ్ చెక్కుచెదరలేదు. సీనియర్ హీరోయిన్ కస్తూరి ఈమధ్య ఒక పాపులర్ టాక్ షోలో మాట్లాడుతూ నాగార్జున అంటే తనకు ఎంత అభిమానమో వెల్లడించారు.
సినిమాల్లోకి రాకముందు తనను మోడలింగ్ చేసేదానినని, అప్పట్లో ఒక రోజు నాగార్జునను కలిసే అవకాశం వచ్చిందని తెలిపారు. ఆరోజు నాగార్జునకు షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం కూడా లభించిందని చెప్పుకొచ్చారు. అయితే అది ఒక మరిచిపోలేని సందర్భం కావడంతో షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత 24 గంటల పాటు ఆ చేతిని కడగలేదని చెప్పారు. ఆ తర్వాత ఆకలి కావడంతో చేతిని కడగాల్సి వచ్చిందని తెలిపారు.
దీన్ని బట్టి నాగార్జున అంటే కస్తూరికి ఎంత అభిమానమో మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు, కస్తూరి అసలు నాగార్జునతో కలిసి నటిస్తానని అప్పట్లో అనుకోలేదని అయితే నటించే అవకాశం లభించిందని ఆమె చెప్పారు. నాగార్జునతో కలిసి కస్తూరి 'ఆకాశవీధిలో', 'అన్నమయ్య' చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే.