బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే... ఈ చిత్రబృందానికి ఓ షాక్ తగిలింది. ఈసినిమా నుంచి కథానాయిక ప్రయాగా మార్టిన్ తప్పుకున్నట్టు సమాచారం. ఇటీవల ప్రయాగ షూటింగ్ లో పాల్గొంది. రెండు రోజుల తరవాత... తను సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు చిత్రబృందానికి సమాచారం అందించిందట. ప్రయాగ కావాలనే తప్పుకుందా, లేదా తప్పించారా? అనే విషయంపై ఆసక్తి కరమైన చర్చ నడుస్తోంది.
ప్రయాగ స్క్రీన్ ప్రజెన్స్ బోయపాటికి ఏమాత్రం నచ్చలేదని, ప్రయాగ బాలయ్య పక్కన సరిజోడీ కాదని భావించాడని, అందుకే ఆమెని తప్పించారని ఓటాక్. ప్రయాగకి తెలుగు రాదు. పైగా ఇక్కడి వాతావరణం పూర్తిగా కొత్త. అందుకే తాను ఇమడలేకపోయిందని, ఆ కారణంతోనే ఈసినిమా నుంచి తప్పుకుందని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా.. బాలయ్య హీరోయిన్ల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ప్రయాగ తప్పుకుంటే ఆ స్థానంలో ఎవరిని తీసుకుంటారో మరి. అన్నట్టు.. ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా.. పూర్ణ నటిస్తున్నసంగతి తెలిసిందే. తాను.. ఇటీవలే సెట్లో అడుగుపెట్టింది కూడా.