అల వైకుంఠపురములో లాంటి ఇండ్రస్ట్రీ హిట్టు ఇచ్చిన త్రివిక్రమ్, ఎన్టీఆర్‌తో మరో సినిమా కమిట్ అవ్వడం తెలిసిన విషయమే. `ఆర్.ఆర్.ఆర్` వల్ల.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా కూడా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో సినిమా చేస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. వెంకటేష్ నుంచి రామ్ వరకూ చాలా పేర్లు వినిపించాయి. చివరికి రామ్ ఖాయం అయ్యాడని చెప్పుకున్నారంతా. ఎన్టీఆర్ `ఆర్.ఆర్.ఆర్` పనులు పూర్తి చేసేలోగా.. త్రివిక్రమ్ మరో సినిమా అవ్వగొట్టేస్తాడని భావించారు. అయితే... త్రివిక్రమ్ ప్లాన్ మార్చాడు. ఎన్టీఆర్ అందుబాటులోకి వచ్చేలోగా ఏ సినిమా చేయకూడదని భావిస్తున్నాడట.
ఈలోగా.. కేవలం ఎన్టీఆర్ కథపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాడట. ఎన్టీఆర్ కంటే ముందుగా మరో హీరోతో సినిమా చేస్తే, ఆ సినిమా అటూ ఇటూ అయితే, ఆ ప్రభావం ఎన్టీఆర్ సినిమాపై పడుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. అలాంటి ప్రమాదాలేం లేకుండా... ఎన్టీఆర్‌సినిమాపై క్రేజ్ తగ్గకుండా ఉండేందుకు త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. సినిమాకి కనీసం 20 కోట్లు తీసుకుంటున్నాడు త్రివిక్రమ్. ఈ గ్యాప్ లో ఒక సినిమా చేస్తే 20 కోట్లు తన ఖాతాలో వేసుకోవొచ్చు. కానీ.. కేవలం ఎన్టీఆర్ కోసం ఆ 20 కోట్లు వదులుకున్నాడు.