'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాలో నువ్వా.. నేనా? అనే టైప్ సీన్లేం లేవట లేడీ సూపర్ స్టార్ విజయ శాంతికీ, సూపర్ స్టార్ మహేష్ బాబుకీ మధ్య. కానీ, ఇద్దరి మధ్యలో వచ్చే సీన్లు చాలా చాలా బాగుంటాయనీ, ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటాయనీ అంటున్నారు విజయ శాంతి. దాదాపు 50 రోజుల పాటు కలిసి షూట్‌లో పాల్గొన్నామనీ, చాలా సరదాగా నడుస్తోందనీ, సెట్‌లో అందరూ తనపై అపారమైన ప్రేమ, ఆదరణ చూపిస్తున్నారని విజయశాంతి చెప్పారు.
తండ్రి కృష్ణ మాదిరిగానే, మహేష్‌బాబు కూడా సెట్స్‌లో చాలా కూల్‌గా కామ్‌గా ఉంటారట. ఎప్పుడూ చిలిపిగా కనిపించింది లేదనీ, ఆ ఆటిట్యూడే ఆయన్ని సూపర్ స్టార్‌ని చేసిందనీ మహేష్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు విజయ శాంతి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. అక్కడ కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మరో మూడు వారాలు అక్కడే సందడి చేయనుంది 'సరిలేరు..' టీమ్. మహేష్‌బాబు, రష్మికా మండన్నాతో పాటు, విజయ శాంతి, ప్రకాష్ రాజ్ తదితర కీలక నటీ నటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. కొన్ని పాటలు సహా, ప్రత్యేకమైన ఫైట్ సీన్ చిత్రీకరణకు కేరళలోని కొన్ని లొకేషన్లు వేదిక కానున్నాయట.
సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకుడు. దిల్‌రాజుతో కలిసి మహేష్‌బాబు ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అన్నట్లు ఈ షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగానే రష్మికా మండన్నా, అల్లు అర్జున్‌తో సినిమా ఓపెనింగ్‌కి రాలేకపోయింది.