విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి `మీకు మాత్రమే చెప్తా` తెరకెక్కించాడు. స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న కుర్ర హీరో నిర్మాత అవ్వడం, దానికి అదనపు హంగుగా తరుణ్ భాస్కర్‌ని హీరో చేయడం నిజంగా సర్‌ప్రైజింగ్ విషయాలే. పైగా టైటిల్‌కూడా యమ క్యాచీగా ఉంది. విజయ్ పూనుకుంటే ఈ సినిమాకి బోల్డంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది. అయితే విజయ్ అలాంటి ప్రయత్నాలేం చేయలేదు. ఈసినిమాని వీలైనంత కామ్‌గా విడుదల చేయాలనుకున్నాడేమో పెద్దగా ప్రమోషన్ల జోలికి వెళ్లినట్టు కనిపించలేదు.
మహేష్ బాబుతో ట్రైలర్ ఆవిష్కరింపజేయడం తప్ప, పెద్దగా మెరుపుల్లేవు. అయితే ఈ కార్యక్రమానికీ మీడియాని దూరం చేశాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పూరి జగన్నాథ్ మినహా పెద్దగా గెస్టులెవరూ రాలేదు. పైగా ఈ కార్యక్రమం కాస్తా చప్పగా సాగింది. సాధారణంగా విజయ్ తన సినిమాలకు పబ్లిసిటీ ఓ రేంజ్‌లో ఇచ్చుకుంటాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కొంచెం తేడా తేడాగా మాట్లాడి, తన సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేలా చూసుకుంటాడు. కానీ.. ఈసినిమా విషయంలో అదేం చేయలేదు. తీరా చూస్తే నవంబరు 1న ఈసినిమా వచ్చేస్తోంది. అంటే... ఇంకా 48 గంటలు కూడా లేదు. విజయ్ సినిమా కదా, పబ్లిసిటీ ఓ రేంజులో ఉంటుందని ఆశించి, ఈ సినిమాని కొన్న బయ్యర్లు... విజయ్ తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
ఏ సెంటర్ల మాట అటుంచితే, బీసీల్లో ఈ సినిమా వస్తుందన్న సంగతే తెలియడం లేదు. పోస్టర్లూ, ఫ్లెక్సీల హడావుడి లేనే లేదు. ఈ సినిమాలో పేరెన్నదగిన హీరో ఎవరూ లేరు. విజయ్ పేరుతోనే బిజినెస్‌జరగాలి. విజయ్ ని చూసే జనాలు సినిమాకు రావాలి. అలాంటప్పుడు ప్రమోషన్లు ఏ స్థాయిలో ఉండాలి? కానీ విజయ్ మాత్రం అదేం పట్టించుకోవడం లేదు. ఇదంతా సైలెంట్ హిట్ కొట్టాలన్న తపనతోనా? లేదంటే సినిమాని విజయ్ గాలికొదిలేశాడా? అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.