అవతార్ సృష్టించిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్లు వసూలు చేసింది. అవతార్ రికార్డుని ఇప్పటి వరకూ ఏ సినిమా బద్దలు కొట్టలేదు. జేమ్స్ కామరూన్ సృష్టించిన ఈ అద్భుతం గురించి ఇప్పటికీ మాట్లాడుకొంటూనే ఉన్నారు. ఇప్పుడు అవతార్ 2 వస్తోంది. అవతార్ 2, 3, 4, 5.. ఇలా తీస్తూనే ఉంటానని జేమ్స్ ఎప్పుడో ప్రకటించేశాడు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నాడు. అవతార్ 2 తరవాత మళ్లీ ఈ సబ్జెక్టు ముట్టుకోనని తేల్చి చెప్పేశాడు.
``అవతార్ కథని మళ్లీ మళ్లీ చెప్పాలని నాకూ ఉంది. అలానే.. ఈ సినిమాని చాలా భాగాలుగా తీయాలని భావించా. కానీ ప్రతీసారీ ఇంతింత కష్టం, ఇన్ని వేల కోట్ల బడ్జెట్ సాధ్యం కాదు. అవతార్ బాగా ఆడింది కాబట్టే... అవతార్ 2 తీశా. అవతార్ 2 కూడా నేను ఆశించిన స్థాయిలో ఆడితే అప్పుడు అవతార్ 3 గురించి ఆలోచిస్తా. లేదంటే అవతార్ ఇక్కడితో సమాప్తం. మళ్లీ ఈ ప్రాజెక్టుముట్టుకోను. ఎందుకంటే ప్రతీసారీ.. ఇంత భారీ ప్రాజెక్టులు చేయడం కుదర్దు. ప్రతీసారీ రిస్కు వర్కవుట్ అవ్వదు`` అని చెప్పుకొచ్చాడు జేమ్స్. డిసెంబరు 16న అవతార్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం నిర్మాతల నుంచి గట్టి పోటీ మొదలైంది. దక్షిణాది అన్ని భాషల్లోనూ ఈ సినిమాని రూ.150 కోట్లకు అమ్మాలని అవతార్ రూపకర్తలు భావిస్తున్నారు.