2023 సంక్రాంతి రేసు మామూలుగా లేదు. వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు.. ఈ సినిమాలన్నీ సంక్రాంతి బరిలో నిలిచాయి. ప్రభాస్ - ఆదిపురుష్ కూడా సంక్రాంతికే రావాలి. అయితే.. ఇప్పుడు ప్రభాస్ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడం లేదు. 2023 వేసవికి షిఫ్ట్ చేశారు. ప్రభాస్ సినిమా రాకపోవడం.. మిగిలినవాటికి ప్లస్సే. ముఖ్యంగా చిరంజీవి, బాయల్య సినిమాలకు దారి ఇచ్చినట్టు అవుతుంది.
ప్రభాస్ సినిమాని దాదాపుగా రూ.300 కోట్లతో రూపొందించారు. ఆ బడ్జెట్ తిరిగి రాబట్టుకోవాలంటే.. మంచి సమయంలో విడుదల చేసుకోవాలి. సంక్రాంతికి మించిన సీజన్ టాలీవుడ్ కి దొరకదు. కాకపోతే... నాలుగు సినిమాల్లో ఒకటిగా విడుదల కావడం... ఆది పురుష్‌కి మంచిది కాదు. అందుకే సోలో రిలీజ్ కోరుకొంది.
సోలోగా వస్తే... ఆదిపురుష్‌కి ప్లస్ అవుతుంది. పైగా ఆదిపురుష్ పాన్ ఇండియా సినిమా. అన్ని చోట్లా.. ఈ సినిమాకి అనువైన వాతావరణం ఉండాలి. అప్పుడే రిలీజ్ చేస్తారు. కొత్త రిలీజ్ డేట్ ని ఆదిపురుష్ టీమ్ అతి త్వరలోనే ప్రకటించబోతోందని సమాచారం. ఓం రౌత్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. టీ సిరీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతోంది. ఇటీవలే టీజర్‌ని కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.