ప్రభాస్ సినిమా అంటే ఏ రేంజ్‌లో హడావుడి ఉండాలి? ఎప్పటి కప్పుడు అప్ డేట్లు వచ్చి పడిపోతుండాలి. షూటింగ్ ఎక్కడ? ఎవరితో..? అనే విషయాలు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి చెబుతుండాలి. కానీ.. `ప్రాజెక్ట్ కె` విషయంలో ఇవేం జరగడం లేదు. నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. అందులో ప్రాజెక్ట్ కె కూడా ఒకటి. ఆది పురుష్, సలార్... సెట్స్‌పై ఉన్నప్పుడే ప్రాజెక్ట్ కె మొదలైపోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ గురించి కానీ, టైటిల్ గురించి కానీ ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతోందా, లేదా? అనేదీ అనుమానంగానే మారింది.
నిజానికి.. మిగిలిన సినిమాలకంటే.. ప్రాజెక్ట్ కె షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతోందట. ఇప్పటికి కనీసం 40 శాతం షూటింగ్ పూర్తయిపోయిందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందట. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా ప్రాధాన్యం ఉంది. షూటింగ్ పూర్తయినా, వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంటుంది. పైగా... ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. వాటి మధ్య నలిగిపోవడం ఇష్టం లేకే.. ప్రాజెక్ట్ కె కి సంబంధించిన వివరాలేం బయటకు రానివ్వడం లేదని టాక్. ఆదిపురుష్, సలార్ విడుదల అయిపోయిన తరవాతే... ప్రాజెక్ట్ కె ప్రచారం మొదలెడతార్ట. అప్పటి వరకూ అంతా గప్ చుప్..!