ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా `ఆది పురుష్`. రామాయణ నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల ప్రభాస్ పై లుక్ టెస్ట్ నిర్వహించారని, అతి త్వరలో షూటింగ్ ప్రారంభిస్తారని కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే అదంతా అబద్ధం అని తెలుస్తోంది. ప్రభాస్ పై ఇప్పటి వరకూఎలాంటి లుక్ టెస్ట్ నిర్వహించలేదని `ఆదిపురుష్` వర్గాలు ధృవీకరించాయి.
అయితే... `రాధే శ్యామ్` అవ్వగానే.. `ఆదిపురుష్` షూటింగ్ ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు ఈ సినిమా కోసం ప్రభాస్ కాల్షీట్లు ఇచ్చాడని సమాచారం అందుతోంది. దాంతో.. నాగ అశ్విన్ సినిమా మరి కొంత వెనక్కి వెళ్లే అవకాశాలున్నాయి. నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా, వైజయంతీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారిందులో. దీపికా పదుకొణె కథానాయిక. జనవరి నుంచి.. ఈ సినిమా మొదలవుతుందని భావించారు. అయితే జనవరి కాల్షీట్లు ఆది పురుష్ కి ఇవ్వడంతో... నాగ అశ్విన్ ఇంకొన్నాళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది.