తెలుగులో సంచలనాలు సృష్టించి, హిందీలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న 'అర్జున్ రెడ్డి' చిత్రం కోలీవుడ్‌లోనూ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. తెలుగులో 'అర్జున రెడ్డి' ఓ ల్యాండ్ మార్క్ మూవీ అయిపోయింది. హిందీలో సత్తా చాటింది. ఇక తమిళంలో ఎలాంటి విజయం అందుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలయ్యాక వివాదాలు వెంటాడాయి.
కానీ, తమిళంలో ఈ సినిమాకి ప్రధమ విఘ్నమే వెంటాడిన సంగతి తెలిసిందే. సీనియర్ దర్శకుడు బాలా ఈ సినిమాని మొదట తెరకెక్కించాడు. అంతా పూర్తయిపోయి విడుదలకు దగ్గర పడిన సమయంలో అవుట్ పుట్ నచ్చలేదని విక్రమ్ సినిమాని ఆపేసి, కొత్త దర్శకుడితో, రీ షూట్ చేయించిన సంగతి కూడా తెలిసిందే. అలా సిద్ధమైన ఈ సినిమాని 'ఆదిత్య వర్మ' పేరుతో బరిలోకి దించుతున్నారు. మొదట దీపావళికి ఈ సినిమాని దించాలనుకున్నారు. కానీ, విజయ్, కార్తీ సినిమాలుండడంతో, రిస్క్ ఎందుకులే అని, రిలీజ్ నవంబర్‌కి షిఫ్ట్ చేశారు.
నవంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బనితా సందు ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఇప్పటికే రెండు భాషల్లో ఈ సినిమా థీమ్ అందరికీ సుపరిచితమైపోయింది. దాంతో తమిళ వెర్షన్ కోసం కథలో ఎక్కువ మార్పులే చేయాల్సి వచ్చిందట. అలా నిర్మాణం ఆలస్యమైన ఈ సినిమాకి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో చూడాలిక.