ఈమధ్య కథానాయికల ఆలోచనా దృక్పథంలో మార్పులొచ్చాయి. తమపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల.. బహిరంగంగానే మాట్లాడుతున్నారు, ధైర్యంగా పెదవి విప్పుతున్నారు. 'మాకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి' అంటూ మీడియా ముందుకు వస్తున్నారు. అతిథిరావు హైదరీకీ ఇలాంటి అనుభవాలు తారస పడ్డాయట. 'సమ్మోహనం', 'అంతరిక్షం' చిత్రాలతో ఆకట్టుకుంది అతిథి. తనకెదురైన కొన్ని చేదు అనుభవాల గురించి తాజాగా ప్రస్తావించింది.
''ఇలాంటి చేదు అనుభవాలు నాకేం ఎదురుకాలేదు. కానీ ఓసారి.. మాత్రం ఓ సంఘటన జరిగింది. దాని ప్రభావం నాపై పడకుండా జాగ్రత్త పడ్డాను. నా ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. వాళ్లు చెప్పిన దానికి తలాడించాలా, లేదంటే... సినిమానుంచి బయటకు వచ్చేయాలా? అనే నిర్ణయం నా చేతుల్లోనే ఉంది. నేను సినిమాని వదిలేశా. అలా వదులుకోవడం వల్ల ఆరేడు నెలలు ఖాళీగా ఉండాల్సివచ్చింది. భవిష్యత్తు అంతా ఇంతేనా? నాకెవ్వరూ పని ఇవ్వరా? అని భయపడ్డాను.కానీ అదృష్టం కొద్దీ ఇప్పుడు నాకు నచ్చిన వ్యక్తులతో పనిచేయగలుగుతున్నా'' అంటోంది అతిథి. మరి తనని ఆ విషయంలో ఇబ్బంది పెట్టిన వ్యక్తుల పేర్లు మాత్రం బయటకు తీసుకురాలేదు.