మెగా రాకుమారుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రంలో ముద్దుగుమ్మ అదితీ రావ్ ఓ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 'ఘాజీ' ఫేం సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదే చిత్రంలో మరో హీరోయిన్గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. కాగా అదితీరావ్ హైదరికి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం.
తొలి సినిమాకే మెగా హీరోతో ఎంట్రీకి అమ్మడు తెగ మురిసిపోతోందట. మెగా ఫ్యామిలీ అంటేనే డాన్సులకు పెట్టింది పేరు. ఈ ముద్దుగుమ్మకి డాన్సంటే ప్రాణమట. దాంతో మెగా కాంపౌండ్‌లో తన తొలి అడుగు వేసినందుకు చాలా సంతోషంగా ఉందని అంటోంది. మెగా కాంపౌండ్‌లో ఒక్కసారి అడుగుపెడితే చాలు. మెగా కాంపౌండ్ హీరోలందరితోనూ నటించే ఛాన్స్ రానే రావచ్చు. అందులో డాన్స్ కింగ్స్ అయిన చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వీరిలో ఏ ఒక్కరి సరసన ఛాన్స్ కొట్టేసినా, అమ్మడి పంట పండినట్లే.
ఆన్ స్క్రీన్ వారితో పోటీ పడి చిందేసే ఛాన్స్ కొట్టేసినట్లే. ఆ అవకాశం కోసమే ఈ బ్యూటీ ఎదురు చూస్తోందట. వరుణ్ తేజ్ డాన్సుల్లో కొంచెం వీక్ అయినా, 'తొలిప్రేమ' సినిమాతో ఆ లోటు తీర్చేశాడు. గత చిత్రాలతో పోల్చితే, 'తొలిప్రేమ'లో వరుణ్ డాన్సులు కూడా ఇరగదీసేశాడు. ఇకపోతే తాజా సినిమా విషయానికి వస్తే, స్పేస్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది.
అదితీరావ్కి ఈ సినిమాలో యాక్టింగ్‌కి స్కోపున్న క్యారెక్టరే దక్కిందంటోంది. డాన్సింగ్ టాలెంట్‌తో పాటు, యాక్టింగ్ టాలెంట్ కూడా చూపించే అవకాశం తొలి సినిమాకే రావడం తన అదృష్టంగా భావిస్తున్నానంటోంది అందాల అదితిరావ్ హైదరీ.