అవతార్ 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుక వచ్చింది. ఈ సినిమా నిడివి మూడు గంటల 12 నిమిషాలు. ఇటీవల ఇంత సుదీర్ఘంగా సాగిన సినిమా మరోటి లేదేమో.? ఇంత నిడివి ఉన్న సినిమాలు చూడ్డం తెలుగు ప్రేక్షకులకు అలవాటు లేదు. అందుకే ఒక్కో చోట ఈ సినిమాకి రెండేసి ఇంట్రవెల్స్ ఇస్తున్నార్ట. అయితే ఇప్పుడు అసలు ఇంట్రవెల్ లేని సినిమా గురించి చెప్పుకొందాం. అదే.. `కనెక్ట్`. నయనతార ప్రధాన పాత్ర పోషించిన హారర్ సినిమా ఇది. వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకి అసలు ఇంట్రవెల్ లేదు.
నిడివి కేవలం 90 నిమిషాలు. అంటే అవతార్ 2 సినిమాలో సగం కంటే తక్కువ. అందుకే ఇంట్రవెల్ ఇవ్వలేదు. ఈ చిత్రానికి అశ్విన్ శరవణన్ దర్శకుడు. గతంలో నయనతారతో `మయూరి` చిత్రాన్ని రూపొందించాడు. ఆ సినిమా హిట్టయ్యింది. అందుకే... నయన తనకు మరో అవకాశం ఇచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో సాగే కథ ఇది. తన బిడ్డకు పట్టిన ఆత్మని... ఓ తల్లి ఎలా వదిలించింది? అనే కాన్సెప్ట్ తో ఈ కనెక్ట్ సాగబోతోంది. అంతర్జాతీయ విలువలు, ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.