రైతు సమస్యల్ని కూడా కమర్షియల్ కథా వస్తువుగా తయారు చేసుకోవచ్చని నిరూపించిన సినిమా ఖైది నెం 150. అదే దారిలో మహర్షి నడిచింది. ఖైదీ నెం 150కీ, మహర్షికీ.. ఉన్న ఏకైక బంధం రైతు సమస్య. ఇప్పుడు ఈ సమస్యని ప్రధానాంశంగా తీసుకుని చాలా కథలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా శర్వానంద్ కూడా ఇలాంటి సబ్జెక్టే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. శర్వా కథానాయకుడిగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కిషోర్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు.
ఈ కథాంశం ఇప్పుడు బయటకు లీక్ అయ్యింది. శర్వానంద్ ఈ సినిమాలో అపర కోటీశ్వరుడిగా కనిపిస్తాడట. తను అనుకోని పరిస్థితుల్లో వ్యవసాయదారుడిగా మారుతాడట. ఆ తరవాత రైతుల కోసం తనేం చేశాడన్నది మిగిలిన కథ. దాదాపుగా ఇది మహర్షి కథని పోలి ఉంది. మరి తీతలో కొత్తగా ఏం చూపిస్తారో చూడాలి. మహేష్ స్టామినా వేరు. స్టార్ డమ్ వేరు. అలాంటి స్టార్లు ఏం చెప్పినా జనాలు చూస్తారు. మరి మహేష్‌ని చూసి వాతలు పెట్టుకుంటున్న శర్వాకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.