సినిమాని ఎంత బాగా తీశామన్నది ఎంత ముఖ్యమో..? అనుకొన్న బడ్జెట్‌లో పూర్తి చేశామా, లేదా? అనేది అంతకంటే ముఖ్యం. సినిమా హిట్టయినా, నిర్మాతలు లాభాలు చూడలేదంటే.. అది కాస్ట్ ఫెయిల్యూర్ కిందే లెక్క. దర్శకుడి అతి జాగ్రత్త వల్లో, సినిమాని ఇంకా బాగా చక్కాలి... అనే ఆలోచన వల్లో... తీసిందే తీసి, కోట్లకు కోట్లు వేస్టేజీ చేస్తారు. సురేందర్ రెడ్డి - అఖిల్ కాంబోలో రూపొందుతున్న ఏజెంట్ విషయంలో ఇదే జరుగుతోంది. ఈ సినిమా మొదలై చాలా కాలమైంది. అయితే ఇప్పటికీ మోక్షం దక్కలేదు. అఖిల్ కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమా ఇది. మాస్ ఇమేజ్ రావాలంటే, కెరీర్ నిలదొక్కుకోవాలంటే ఈ సినిమాతో హిట్టు కొట్టడం చాలా ముఖ్యం. అందుకే... సురేందర్‌రెడ్డి ఎన్నిసార్లు రీషూట్లకు పిలిచినా వెళ్తున్నాడు.
ఈ సినిమాకి సంబంధించిన థియేటరికల్ రైట్స్ అమ్ముడైపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక రైట్స్ కి రూ.34 కోట్లు పలికిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అఖిల్ కెరీర్‌లో ఇది బెస్ట్ ఫిగర్. నాన్ థియేటరికల్ రైట్స్ రూపంలో మరో రూ.20 కోట్లు వచ్చినా మొత్తంగా రూ.55 కోట్లు సంపాదించుకొంటుంది. అయితే ఏం లాభం..? ఈ సినిమాకి దాదాపుగా రూ.70 కోట్ల పెట్టుబడి పెట్టారు. అంటే.. ఇంకా 15 కోట్ల నష్టంలో ఉంది. సినిమా విడుదలై అమోఘమైన విజయం సాధించి, ఓవర్ ఫ్లోస్ వస్తే తప్ప... నిర్మాత గట్టెక్కడు. అందుకే ఈ సినిమాకి ఇంత రేటు వచ్చినా, నిర్మాత అనిల్ సుంకర కళ్లల్లో ఆనందం లేదు.