`నువ్వే కావాలి..` - చిన్న సినిమాల్లో ఇదో సంచలనం. ఓ ట్రెండ్ సెట్టర్. చిన్న సినిమాగా విడుదలై... వసూళ్ల వరద సృష్టించి - పెద్ద సినిమాలకు తలదన్నే స్థాయిని సంపాదించుకుంది. త్రివిక్రమ్ ని `మాటల మాంత్రికుడు`గా నిలబెట్టిన సినిమా ఇది. త్రివిక్రమ్ - విజయ్ భాస్కర్ కాంబినేషన్ లో మరిన్ని విజయవంతమైన సినిమాలు రావడానికి దోహదం చేసింది. ఈ సినిమా విడుదలై... మంగళవారంతో 20 ఏళ్లు. ఈ సందర్భంగా `నువ్వే కావాలి` జ్ఞాపకాల్ని పంచుకున్నారు త్రివిక్రమ్. '' రెయిన్‌బో ల్యాబ్‌లో 'నిరమ్' షో వేశాం.
రామోజీరావుగారితో పాటు నేను, రవి కిశోర్‌గారు, వేమూరి సత్యన్నారాయణగారు మాత్రమే ఉన్నాం. ఆరోజు ఏదో పని ఉండి విజయ్ భాస్కర్‌గారు రాలేదు. షో పూర్తయి బయటికి వచ్చిన తర్వాత కారిడార్‌లో సుమారు 20 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆ 20 నిమిషాల మధుర జ్ఞాపకాలు.. ఇప్పుడు 20 ఏళ్ళు మాట్లాడుకునేలా చేశాయి. ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా.. నాకు గుర్తొచ్చేది ఈ 20 నిమిషాలే. ఆ తర్వాత ఓ నాలుగైదు రోజులు మేము మార్పులు, చేర్పులు చేసిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశాం. 50 రోజుల లోపు షూట్ చేసిన సినిమా. 365 రోజులు కంటే ఎక్కవ ఆడిన సినిమా. 20 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా గుర్తున్న సినిమా.
నేను ఈ సినిమా షూటింగ్‌కి కేవలం ఓ నాలుగైదు రోజులు మాత్రమే వెళ్లాను. ముందే విజయ్ భాస్కర్‌గారితో కలిసి అన్నీ పూర్తి చేశాం. రెండు నెలలు పిక్‌నిక్‌లా జరిగిపోయింది. ఎలాంటి భయాలూ లేకుండా చేసిన సినిమా ఇది. ఈ సినిమా ఆడకపోతే.. ఏమైపోతుందో అన్న భయం లేకుండా తీశాం. మేం ఏం చేసినా మా వెనుక రామోజీరావు గారు ఉన్నారన్న నమ్మకమే. సెట్‌కి కూడా పెద్దగా వెళ్లలేదు. నాలుగుసార్లు వెళ్లుంటానంతే. మమ్మల్ని సరిగ్గా డైరెక్ట్ చేసింది స్రవంతి రవికిషోర్. ఆయన లాంటి నిర్మాత ఉండడం వల్లే ఈసినిమా సాధ్యమైంది`` అన్నారు.