తెలుగు తెరపై పరభాషా నటుల హవా కొనసాగుతోంది. పాన్ ఇండియా అనే ఓ మత్తు తగిలాక అది మరింత గా పెరిగింది. అన్ని భాషల్నీ కవర్ చేయడానికి మిగిలిన చోట నుంచి నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని దిగుమతి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హిందీ నుంచి స్టార్లను భారీ పారితోషికాలిచ్చి మరీ ఆహ్వానిస్తున్నారు. `ఆర్.ఆర్.ఆర్` కోసం బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్‌ని తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా కోసం అజయ్ అందుకున్న పారితోషికం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఈ సినిమాలో నటించడానికి ఆయన 25 కోట్లు డిమాండ్ చేశారని సమాచారం. అడిగినంత ఇవ్వడానికి ఆర్.ఆర్.ఆర్ టీమ్ కూడా ఒప్పుకుంది. ఇంతకీ అజయ్ కనిపించేది 30 నిమిషాలు మాత్రమే. అయితే అజయ్ పాత్ర - ఈ సినిమా ఫలితాన్ని శాశించేలా తీర్చిదిద్దార్ట రాజమౌళి. స్వతహాగానే రాజమౌళి సినిమాల్లో ప్రతినాయక పాత్రలు బలంగా ఉంటాయి. అజయ్ దేవగణ్ లాంటి నటుడు ఉంటే, తప్పకుండా మరో స్థాయిలోనే చూపిస్తారు. ఈ సినిమాకి అజయ్ ఎంత ప్లస్సో, ఈ సినిమా అజయ్ దేవగణ్ కెరీర్‌కి అంత ప్లస్ అవుతుందని చిత్రబృందం చెబుతోంది.