గత కొన్నాళ్లుగా తమిళ హీరో అజిత్ రాజకీయాల్లోకి రానున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ భాధ్యతల్ని అజిత్ స్వీకరిస్తారనీ భావించారంతా. జయలలితకు రాజకీయ వారసుడిగా అజిత్ పేరు మార్మోగిపోయింది గతంలో. అయితే రాజకీయ ఎంట్రీపై అజిత్ తాజాగా స్పందించారు.
'రాజకీయాలకు సంబంధించి నాకు కొన్ని స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. అవి పూర్తిగా నా వ్యక్తిగతం. ఏ రాజకీయ పార్టీకి నేను మద్దతివ్వను. నా అభిమానులు తమకు నచ్చిన పార్టీలకు మద్దతిచ్చుకోవచ్చు. కానీ నా అభిప్రాయాలు మాత్రం నాకున్నాయి. నా ఫోటోలు ఏ రాజకీయ పార్టీలు ఉపయోగించుకోకూడదు. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల పైనే. రాజకీయాల గురించి తర్వాత ఆలోచిస్తాను..' అని అజిత్ పేర్కొన్నారు.
మరోవైపు బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనా కపూర్ విషయంలోనూ రాజకీయంగా చర్చ జరుగుతోంది. కరీనా కపూర్ ఎలక్షన్స్‌లో పోటీ చేయనుందని ప్రచారం జరుగుతోంది. కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకెంత మాత్రమూ లేదనీ తనపై జరుగుతున్న ఈ ప్రచారమంతా జస్ట్ గాసిప్సేనని, ప్రస్తుతం కెరీర్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టనున్నానని.. కరీనాకపూర్ స్పష్టం చేసింది. గతంలో మాధురీ దీక్షిత్‌పైనా ఇలాంటి గాసిప్సే వచ్చాయి. మాధురీ కూడా వాటినిలాగే సున్నితంగా ఖండించింది.