2019 సంవత్సరంలో మొదటి హిట్ సినిమాగా నిలిచింది 'ఎఫ్ 2'. వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటించిన ఈ సినిమా విడుదలయిన రెండవ వారంలో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతూ సంక్రాంతి విజేతగా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ద్వారా తనదైన శైలిలో నవ్వులు పండించిన అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. 2018 సంవత్సరంలో ఒక్క హిట్ సినిమా కూడా సాధించలేకపోయిన నిర్మాత దిల్ రాజు 'ఎఫ్ 2' చిత్రంతో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు.
ఇక, స్టార్ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కామెడీ టైమింగ్, నటనా ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకోగల సత్తా ఉన్న హీరో విక్టరీ వెంకటేష్. 'ఎఫ్ 2' సినిమా హిట్ కావడంలో ఎక్కువ క్రెడిట్ వెంకటేష్ కే దక్కింది. వెంకటేష్ తో పోటీ పడకపోయినా వరుణ్ తేజ్ కూడా తనకి పరిచయం లేని జోనర్ లో తెలంగాణ యాసతో నటించి అభిమానులను మెప్పించాడు. అయినా సరే, వరుణ్ కి ఈ సినిమా విజయంలో రావాల్సిన క్రెడిట్ దక్కలేదు.
వెంకీ ని కోబ్రా, బ్రో అంటూ తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను ఆకర్షించినప్పటికీ.. వరుణ్ కి సరైన గుర్తింపు రాలేదు. 'దిల్ రాజు సూపర్ హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి హిలేరియస్ గా నవ్వులు పండించడంలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. చాలా రోజుల తర్వాత వెంకీ ఫ్యామిలీ హీరోగా, తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు' అని అంటున్నారే తప్ప మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని మాత్రం ఎవరూ గుర్తించట్లేదు.