తమిళంలో వచ్చిన `వాలి` సినిమా గుర్తుండే ఉంటుంది. అజిత్ హీరో. సిమ్రాన్ కథానాయిక. ఎస్.జే. సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయ్యింది. తెలుగులోనూ డబ్ అయ్యింది. పాటలు బాగుంటాయి. 1999లో విడుదలైంది. ఇప్పుడు... 22 ఏళ్ల తరవాత ఈ సినిమా రీమేక్ రైట్స్‌ని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు. కన్నడ, హిందీ భాషల్లో మినహా, అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నార్ట.
నిజానికి 2020లోనే బోనీకపూర్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. అయితే... ఆ తరవాత... కోర్టు కేసులు వచ్చి వాలిపోయాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ పై తనకొక్కడికే హక్కు ఉందని దర్శకుడు ఎస్.జే సూర్య కోర్టు కెళ్లారు. దాంతో వాలి రీమేక్ ఆగిపోయింది. ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చేసింది. ఓ సినిమా రీమేక్ రైట్స్ అమ్మే అధికారం దర్శకుడితో పాటుగా, నిర్మాతకూ ఉంటుందని తీర్పు చెప్పింది. దాంతో.. బోనీకి మార్గం సుగమం అయ్యింది. త్వరలోనే ఈ ఒక్కో భాషకూ ఒక్కో దర్శకుడినీ, ఒక్కో హీరోనీ ఎంపిక చేసి, వాళ్ల పేర్లు ప్రకటించనున్నారు బోనీ. తెలుగులో ఇప్పటికే `వాలి` పాత్రలో కనిపించే హీరో దొరికేశాడని టాక్. మరి అజిత్ పాత్రలో కనిపించే ఛాన్స్ ఎవరికి వచ్చిందో?