ఆకాష్ పూరి మంచి నటుడు. చూడ్డానికి బావుంటాడు. యాక్షన్, డైలాగ్ డిక్షన్ అన్నీ చక్కగా వుంటాయి. అయితే ఇప్పటి వరకూ సరైన విజయం మాత్రం దక్కలేదు. తాజాగా 'చోర్ బజార్' సినిమా చేశాడు. ఈ సినిమా అయితే మరీ దారుణం. తనకు ఏ మాత్రం సరిపడని కథని ఎంచుకొని చాలా కష్టపడ్డాడు. నిజానికి ఆకాష్ మొదటి నుండి మాస్ సినిమాలే చేస్తున్నాడు. మాస్ ఇమేజ్ లేనప్పుడు అలాంటి కథతో మెప్పించడం చాలా కష్టం. ఐకాన్ స్టార్ బన్నీ కానీ, మాస్ మహారాజా రవితేజ కానీ ఇలా ఎంతో మంది మాస్ స్టార్స్ అన్నప్రాసన రోజునే అవకాయ్ తినలేదు. రెండు సినిమాల తర్వాత రిజిస్టర్ అయ్యాకే ఒక గుద్దుకు పది మంది గాల్లో లేచిపోయే సినిమాలు చేశారు. ప్రేక్షకులు అంగీకరించారు.
కానీ ఏ ఇమేజ్ లేకుండా ఓన్లీ మాస్ మసాలా కథలు చేసుకుంటూ వెళ్ళడం ఆకాష్ కి తలకు మించిన భారం అవుతుంది. ఈ విషయాన్ని ఆకాష్ గుర్తించాలి. విజయ్ దేవరకొండ లాంటి స్టార్లు కంటెంట్ నమ్మి కథలు ఎంపిక చేసుకునే 'లైగర్' లాంటి పాన్ ఇండియా సినిమా వరకూ వచ్చారు. ఆకాష్ ఈ విషయాన్ని రియలైజ్ అవ్వాలి. ఫైట్లు ఫీట్లు కాస్త పక్కన పెట్టి అందరూ సమ్మతించే కథలపై ద్రుష్టి పెట్టాలి. విజయం వచ్చిన తర్వాత ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ ని తనకు కావాల్సినట్లు మార్చుకోవాలి తప్పితే.. ఇలా బ్లైండ్ గా మాస్ రూట్లో వెళితే మాత్రం ప్రయాణం కష్టం.