అక్కినేని ఇంటి నుంచి వచ్చిన మరో హీరో అఖిల్. తన అరంగేట్రం అనేసరికి దర్శకులంతా అలర్ట్ అయిపోయారు. `అఖిల` సినిమాతో తాను కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకి ఏకంగా 50 కోట్ల బడ్జెట్ అయ్యింది. అయితే ఫలితం రాలేదు. అక్కడి నుంచి అఖిల్ బ్యాడ్ టైమ్ మొదలైంది. వరుసగా అన్నీ ఫ్లాపులే. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఒక్కటీ లేదు. అయితే `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మాత్రం నిర్మాతల చేతుల్లో కాస్త డబ్బులు పెట్టగలిగింది.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. గత శుక్రవారం విడుదలైంది. తొలి వారం.. ఈ సినిమా దాదాపుగా 22 కోట్లు సాధించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అంటే... మొత్తంగా చూస్తే.. పెట్టుబడి వెనక్కి రాబట్టేసి, బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడు వస్తున్నవన్నీ లాభాల కిందే లెక్క. మరోవైపు శాటిలైట్, ఓటీటీ పరంగా చూస్తే - నిర్మాతలకు మంచి లాభాల్ని అందించినట్టైంది. నైజాంలో ఈసినిమా ఇప్పటి వరకూ 7 కోట్లు సాధించింది. అఖిల్ కెరీర్ లో ఇదే బెస్ట్. సీడెడ్ లో 4 కోట్లు, ఉత్తరాంధ్రలో 2 కోట్లు తెచ్చుకుంది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ నుంచి మరో 3.5 కోట్లు వచ్చాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటు విడుదలైన మహా సముద్రం డిజాస్టర్ అవ్వడం కూడా అఖిల్ సినిమాకి కలిసొచ్చినట్టే చెప్పుకోవాలి.