అఖిల్ అంటే, టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ కాదు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్. సోషల్ మీడియాలో 'కరివేపాకు'గా విమర్శలు ఎదుర్కొంటున్న అఖిల్, అనూహ్యంగా బిగ్‌బాస్ రేసులో దూసుకెళుతున్నాడు. దానిక్కారణం, అబిజీత్‌తో గొడవలు పెట్టుకోవడమే. నిజానికి, ఇక్కడిదాకా అఖిల్ ప్రయాణం సాగిందంటే.. కేవలం అబిజీత్‌తో గొడవల వల్లనే. అబిజీత్‌కి ఎలాగూ ఫాలోవర్స్ వున్నారు. ఆ విషయాన్ని ఎలా గ్రహించాడోగానీ, అవసరం వున్నా లేకపోయినా అబిజీత్‌తో గొడవ పడటం ద్వారా, తన పేరు సోషల్ మీడియాలో నిత్యం హైలైట్ అయ్యేలా చూసుకుంటున్నాడు.
లోపల వున్న అఖిల్, ఇవన్నీ చేస్తున్నాడని అనలేంగానీ, అతని కోసం ఓ టీమ్ ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టేస్తోంది. అలా ముందే అఖిల్ అన్నీ ప్లాన్ చేసుకుని వుండాలి. ఇదంతా బిగ్‌బాస్ గత సీజన్లు ఫాలో అయ్యేవారికి తేలిగ్గానే అర్థమయిపోతుంది. అలాంటిది, కంటెస్టెంట్స్ ఈ తరహా ప్లానింగ్ లేకుండా ఎలా వస్తారు.? కుమార్ సాయి హౌస్ నుంచి వెళ్ళిపోతూ, 'కరివేపాకు' ప్రస్తావన తీసుకురావడం ఆ తర్వాత, ఆ 'కరివేపాకు'ని అఖిల్ కోసం నెటిజన్లు కొందరు వాడుతుండడం తెలిసిన సంగతే.
'నాకేమన్నా అబజిత్‌తో వ్యక్తిగత వైరం వుందా.?' అని అమాయకంగా ప్రశ్నిస్తూనే, గేమ్‌లో ముందుకెళ్ళడానికి లేని 'వైరాన్ని' అప్పటికప్పుడు అరువు తెచ్చుకుంటున్న అఖిల్‌ని చూసి కొంతమంది జాలిపడుతున్నారు. అయితే, టాప్ 5లో అఖిల్ వుండడం అంత ఈజీ కాదన్నది నెటిజన్ల మాట. ఏమో, బిగ్‌బాస్ స్క్రిప్ట్ ఎలా వుందో!