అఖిల్ తొలి సినిమా అఖిల్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర పల్టీలు కొట్టింది. ఈ చిత్రానికి నితిన్ నిర్మాత. తన స్నేహితుడి కోసం సినిమా తీసి చాలా నష్టపోయాడు. కనీసం 20 నుంచి 30 కోట్ల వరకూ నష్టాలొచ్చాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఆ ఓటమి భారం నుంచి కోలుకోవడానికి నితిన్‌కి చాలా కాలం పట్టింది. అయితే ఇప్పుడు ఆ బాకీని తీర్చేయడానికి అఖిల్ రెడీ అయ్యాడని టాక్. నితిన్ కోసం అఖిల్ ఫ్రీగా ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడితో పరిమిత బడ్జెట్‌తో ఈ సినిమా పూర్తి కానున్నదట. దానికి నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తాడు.
వీలైనంత ఎక్కువ టేబుల్ ప్రాఫిట్‌తో ఈ సినిమా బిజినెస్ క్లోజ్ చేయాలని భావిస్తున్నాడు అఖిల్. తన కొత్త సినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` తరవాత ఈ సినిమా ఉండబోతోందని టాక్. ఆ సినిమా హిట్టయితే అఖిల్ మార్కెట్ పెరుగుతుంది. అప్పుడు ఎలాంటి సినిమా చేసినా సరే... టేబుల్ ప్రాఫిట్ రావడం ఖాయం. అందుకే.. తదుపరి చిత్రాన్ని నితిన్‌కి అప్పజెప్పినట్టు టాలీవుడ్ టాక్. మరి... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఫ్లాప్ అయితే మాత్రం... ఈ ప్లానింగంతా మారే అవకాశం ఉంది.