బయోపిక్‌ల జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. దేశ వ్యాప్తంగా చాలా బయోపిక్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. తెలుగులోనూ వాటి హవా బాగానే ఉంది. యువ హీరోలంతా బయోపిక్ లో నటించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ జాబితాలో అక్కినేని హీరో అఖిల్ కూడా చేరిపోయాడు. అఖిల్ కి కూడా బయోపిక్ లోనటించాలని ఉందట. అయితే అది క్రికెటర్ కథ అయితే బాగుంటుందని, ముఖ్యంగా విరాట్ కోహ్లీ కథతో ఎవరైనా వస్తే, నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు అఖిల్.
అఖిల్ మంచి క్రికెటర్. సీసీఎల్ లో టాలీవుడ్ జట్టుకు అఖిల్ కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తన ఆట తీరు పక్కా ప్రొఫెషనల్ గా ఉంటుంది. తనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా విరాట్ అంటే మహా అభిమానం. ''విరాట్ ఆటిట్యూడ్ చాలా బాగుంటుంది. క్రికెట్ పై తనకున్న ప్యాషన్ అంతా ఇంతా కాదు. అదంతా తెరపై చూపిస్తే బాగుంటుంది. తన కథతో ఎవరైనా సినిమా తీయాలని వస్తే, నేను నటించడానికి సిద్ధంగా ఉన్నా'' అని చెప్పుకొచ్చాడు అఖిల్. మరి అలాంటి ప్రయత్నం ఎవరైనా చేస్తారేమో చూడాలి. తాను నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` శుక్రవారం విడుదల అవుతోంది. మరోవైపు`ఏజెంట్` సెట్స్‌పై ఉంది.