మా అధ్యక్షుడిగా విష్ణు నిలబడినప్పుడు జగన్ ప్రభుత్వ అండదండలు విష్ణుకి ఉంటాయని, జగన్ తో చెప్పి పనులు ఈజీగా చేయించుకోవచ్చని విష్ణు వర్గం ప్రచారం చేసింది. విష్ణు కూడా `జగన్ మా బావ..` అంటూ ఒకట్రెండు సందర్భాల్లో గుర్తు చేసి, మా సభ్యుల మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించారు. విష్ణు గెలిస్తే.. ఈ సంబంధాలు బాగా పనిచేస్తాయన్న నమ్మకం మిగిలిన మా సభ్యులకు కలిగింది. యాధృచ్చికమో, ఏమో.. `మా` అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం చేసిన రోజే... ఏపీ ప్రభుత్వం నుంచి టాలీవుడ్ కి ఓ శుభవార్త అందింది.
దసరా నుంచి థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో బుధవారం వరకూ రాత్రిపూట కర్‌ఫ్యూ అమలులో ఉండేది. ఇప్పుడు దాన్ని సవరించారు. దాంతో సెకండ్ షోలకు అనుమతి లభించినట్టైంది. అంటే ఇప్పుడు నాలుగు ఆటలూ ప్రదర్శించుకోవచ్చన్నమాట. దసరా సీజన్‌లో రాబోతున్న సినిమాలకు ఇది శుభవార్తే. సరిగ్గా విష్ణు ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. ఈ ఉత్తర్వులు వెలువడడం విశేషం. కాకపోతే ఏపీలో టికెట్ రేట్ల విషయంలో ఇంకా కన్‌ఫ్యూజన్ ఉంది. త్వరలోనే వాటినీ సవరించే అవకాశం ఉంది.